
KTR: ఫార్ములా ఈ-కారు రేస్ కేసులో కేటీఆర్‌కు బిగ్‌షాక్.. విచారణకు రావాలంటూ ఈడీ నోటీసులు
రాష్ట్రంలో తీవ్ర రాజకీయ ప్రకంపనలు సృష్టించిన ఫార్ములా ఈ- కార్ రేసు వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు షాక్ తగిలింది.
Formula E-Car Race Case: రాష్ట్రంలో తీవ్ర రాజకీయ ప్రకంపనలు సృష్టించిన ఫార్ములా ఈ- కార్ రేసు వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు షాక్ తగిలింది. కేటీఆర్ కు ఈడీ నోటీసులు ఇచ్చింది. జనవరి 7న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. అదేవిధంగా ఈ కేసులో నిందితులుగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డికి కూడా ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. వీరిని జనవరి 2, 3 తేదీల్లో విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసుల్లో పేర్కొంది.
ఫార్ములా ఈ-కారు రేసింగ్ కేసులో ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా పీఎంఎల్ఏ కింద ఈడీ విచారణ చేస్తుంది. ఈ వ్యవహారంలో ఫెమా నిబంధనలు ఉల్లంఘనలు జరిగినట్లు ఈడీ నిర్దారణకు వచ్చింది. ఎఫ్ఈఓకు 55 కోట్ల నగదు బదిలీ, ఆర్థిక పరమైన అవకతవకలు జరిగినట్లు ఈడీ అనుమానిస్తుంది. ఈనేపథ్యంలో మాజీ మంత్రి కేటీఆర్ కు ఈడీ నోటీసులు పంపించినట్లు తెలుస్తోంది.
ఫార్ములా ఈ-కారు రేస్ కేసులో ఈడీ అధికారులు దూకుడు పెంచారు. ఇప్పటికే ఏసీబీ అధికారులు నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ అధికారులు ఈసీఐఆర్ (ఎన్ ఫోర్స్ మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్) కింద కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో తాజాగా జనవరి 7న విచారణకు రావాలని కేటీఆర్ కు ఈడీ నోటీసులు ఇచ్చింది. అదేవిధంగా జనవరి 2న విచారణకు హాజరుకావాలని అరవింద్ కుమార్ కు, జనవరి 3న రావాలని బీఎల్ఎన్ రెడ్డిలకు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు.
ఏసీబీ అధికారులు ఇప్పటికే పలు సెక్షన్ల కింద కేటీఆర్, అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డిపై కేసులు నమోదు చేశారు. అయితే, కేటీఆర్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనపై ఏసీబీ నమోదు చేసిన కేసులను కొట్టివేయాలని కోరుతూ ఈనెల 21న కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం కేటీఆర్ ను ఈనెల 30వరకు అరెస్టు చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది. తుదుపరి విచారణ 31వ తేదీకి వాయిదా వేసింది.
ఈడీ నోటీసులపై కేటీఆర్ ఎలా రియాక్ట్ అవుతారనే అంశం ఆసక్తికరంగా మారింది. ఈడీ అధికారుల నోటీసులకు స్పందించి కేటీఆర్ విచారణకు హాజరవుతారా.. నోటీసులను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయిస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు.. ఈడీ అధికారులు తమ దర్యాప్తును ముమ్మరం చేశారు. ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధం ఎందుకు డబ్బులు ట్రాన్సఫర్ చేశారు. ఎఫ్ఈఓ కంపెనీకి నగదు బదిలీ విషయంలో ఫెమా యాక్ట్ నిబంధనలు ఉల్లంఘించారా..? అనే కోణంలో ఈడీ దర్యాప్తు సాగే అవకాశం ఉంది. ఎవరు అప్రూవల్ చేశారు.. కేబినెట్ ఆమోదం ఉందా.. ఫైనాన్షియల్ డిపార్ట్ మెంట్ ఆమోదం ఉందా లేదా అనే విషయాలపై ఈడీ అధికారులు దర్యాప్తు చేయనున్నారు. ఈడీ అధికారులు దాన కిషోర్ స్టేట్ మెంట్ ను నమోదు చేసుకొని ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు సేకరించే అవకాశం ఉంది.
Comment / Reply From
Popular Posts
Newsletter
Subscribe to our mailing list to get the new updates!