Dark Mode
Image
  • Friday, 09 May 2025
Russia Cancer Vaccine : గుడ్ న్యూస్.. క్యాన్సర్ వ్యాధికి కొత్త వ్యాక్సిన్.. 2025 నుంచి ఉచితంగా అందిస్తాం : రష్యా ప్రకటన!

Russia Cancer Vaccine : గుడ్ న్యూస్.. క్యాన్సర్ వ్యాధికి కొత్త వ్యాక్సిన్.. 2025 నుంచి ఉచితంగా అందిస్తాం : రష్యా ప్రకటన!

Russia Cancer Vaccine : ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన వ్యాధి క్యాన్సర్‌ను ఓడించేందుకు కొత్త వ్యాక్సిన్‌ను రష్యా ప్రకటించింది. 2025 నుంచి తమ పౌరులకు ఈ వ్యాక్సిన్‌ను ఉచితంగా అందించనుంది.

Russia Cancer Vaccine : చాలా ఏళ్ల తర్వాత ఎట్టకేలకు అత్యంత ప్రమాదకరమైన క్యాన్సర్‌ వ్యాధికి పరిష్కారాన్ని కనుగొన్నారు శాస్త్రవేత్తలు. నయం లేని క్యాన్సర్ వ్యాధిని నివారించే మార్గాన్ని కనిపెట్టారు. ప్రపంచంలోనే తొలిసారిగా క్యాన్సర్ వ్యాక్సిన్‌ను రూపొందించామని, త్వరలో ఈ క్యాన్సర్ వ్యాక్సిన్ విడుదల చేస్తామని రష్యా ప్రకటించింది. ప్రతి ఏడాదిలో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు క్యాన్సర్ కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు.

ప్రస్తుతానికి దీనికి కచ్చితమైన నివారణ చికిత్స లేదు. ఒకవేళ పలు చికిత్సలు అందుబాటులో ఉన్నప్పటికీ, ఒక సాధారణ వ్యక్తి తన ఇల్లు, భూమిని అమ్ముకోవాల్సినంత ఖర్చు అవుతుంది. అయితే, చివరకు క్యాన్సర్ మహ్మమారిని జయించే సమయం వచ్చేసింది. ప్రపంచం పోలియోను ఓడించినట్లే.. శాస్త్రవేత్తలు కూడా క్యాన్సర్‌కు వ్యాక్సిన్‌ను తయారు చేశారు. రష్యా ఈ వ్యాక్సిన్‌ను అతి త్వరలో ప్రపంచానికి తీసుకువస్తోంది.

ఈ వారమే రష్యా తన సొంత (mRNA) ఆధారిత వ్యాక్సిన్‌ను క్యాన్సర్‌కు చికిత్స చేసేందుకు అభివృద్ధి చేసినట్లు పేర్కొంది. ఈ క్యాన్సర్ వ్యాక్సిన్ 2025 ప్రారంభం నుంచి తమ పౌరులకు ఉచితంగా అందుబాటులో ఉంటుందని ప్రభుత్వ వార్తా సంస్థ (TASS) తెలిపింది. ఈ వ్యాక్సిన్‌ క్యాన్సర్‌ను ఓడించడంలో సాయపడుతుందని రష్యా పేర్కొంది. క్యాన్సర్‌కు ఇదే మొదటి వ్యాక్సిన్ కావడం విశేషం. రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖ రేడియాలజీ మెడికల్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ ఆండ్రీ కప్రిన్ ప్రకారం.. ఈ (m-RNA) వ్యాక్సిన్ అన్ని ప్రీ-క్లినికల్ పరీక్షలలో పాస్ అయింది.

ఈ టీకా క్యాన్సర్ కణాల పెరుగుదలను ఆపడమే కాకుండా మెటాస్టాసిస్ స్థాయికి చేరకుండా నిరోధించే సామర్థ్యాన్ని కూడా చూపింది. రష్యా కూడా ఏఐ సాయంతో క్యాన్సర్ వ్యాక్సిన్‌లను తయారు చేస్తోంది. వాస్తవానికి (mRNA) టీకా అనేది రోగనిరోధక ప్రతిస్పందనను ఉత్పత్తి చేసే మెసెంజర్ RNA (mRNA) అణువు కాపీని ఉపయోగించే ఒక రకమైన టీకా. ఇప్పుడు, రష్యా శాస్త్రవేత్తలు క్యాన్సర్‌కు వ్యతిరేకంగా ఈ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసినట్లు చెప్పారు. క్యాన్సర్ రోగులందరికీ ఉచితంగా పంపిణీ చేయనున్నట్టు వెల్లడించింది.

క్యాన్సర్‌తో ఏటా లక్షలాది మరణాలు :
2022లో ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల మంది కొత్త కేన్సర్‌ రోగులు కనిపించారని డబ్ల్యూహెచ్‌వో ఇటీవలే చెప్పడం గమనార్హం. అదే సమయంలో, 97 లక్షల మంది రోగులు ప్రాణాలు కోల్పోయారు. అంటే.. ప్రతి ఐదుగురిలో ఒకరు తమ జీవితంలో క్యాన్సర్ బారిన పడుతున్నారు. అలాంటి పరిస్థితిలో, ఈ టీకా శతాబ్దపు అతిపెద్ద ఆవిష్కరణగా చెప్పవచ్చు.

భారత్‌లో క్యాన్సర్ కేసుల పరిస్థితి ఏంటి? :
భారత్ విషయానికి వస్తే.. 2022లో 14.13 లక్షల కొత్త క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి. వీరిలో అత్యధిక సంఖ్యలో మహిళలు ఉన్నారు. 2022లో 7.22 లక్షల మంది మహిళలు క్యాన్సర్ బారిన పడగా, 6.91 లక్షల మంది పురుషులు క్యాన్సర్ బారిన పడ్డారు. ఈ వ్యాధి కారణంగా దేశంలో 9.13 లక్షల మంది రోగులు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో, నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్ నివేదిక ప్రకారం.. గత ఏడాదిలో దేశంలోని 23.68 లక్షల మంది పౌరులు క్యాన్సర్ కారణంగా ప్రాణాలు కోల్పోగా, 42 లక్షల మంది కొత్త రోగులను గుర్తించారు.

ఐదేళ్లలో దేశంలో కేన్సర్‌ రోగుల సంఖ్య 12 శాతం పెరుగుతుందని ఐసీఎంఆర్‌ నివేదిక అంచనా వేసింది. అయితే, చిన్నవయసులో క్యాన్సర్‌ బారిన పడే వారికే అతిపెద్ద సవాలు. నేచర్ జర్నల్‌లోని పరిశోధన ప్రకారం.. చిన్న వయస్సులోనే క్యాన్సర్ రావడానికి అతిపెద్ద కారణం నేటి జీవనశైలి. దేశంలో చాలా క్యాన్సర్లు రొమ్ము, నోరు, గర్భాశయం, ఊపిరితిత్తులలోనే కనిపిస్తాయి.

mRNA అంటే ఏంటి? :
ఎంఆర్ఎన్ఏ అంటే.. మెసెంజర్ RNA మన శరీరంలో కనిపిస్తుంది. ఇది మానవ జన్యు సంకేతంలో ఒక చిన్న భాగం. మన కణాలలో ప్రోటీన్లను తయారు చేయడంలో పనిచేస్తుంది. ఒక బ్యాక్టీరియా లేదా వైరస్ మన శరీరంలోకి ప్రవేశించినప్పుడు అది మనకు ప్రమాదకరమైతే.. ఆ వైరస్ లేదా బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా ప్రోటీన్లను తయారు చేయమని (mRNA) మన కణాలకు సందేశాన్ని పంపుతుంది. దీని కారణంగా.. మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థకు అవసరమైన ప్రోటీన్లు అందుతాయి. శరీరంలో వెంటనే యాంటీబాడీలు తయారవుతాయి. టీకా సాంప్రదాయిక టీకా కన్నా వేగంగా తయారు అవుతుంది. శరీరం రోగనిరోధక శక్తి కూడా బలంగా మారుతుంది.

ఏఐతో గంటలో క్యాన్సర్ వ్యాక్సిన్ అభివృద్ధి :
ఏఐ ఒక గంటలో వ్యాక్సిన్‌లను అభివృద్ధి చేయగలదు. వ్యాక్సిన్ ట్రయల్స్ మధ్య, జింట్స్‌బర్గ్ మీడియాతో మాట్లాడుతూ.. కృత్రిమ న్యూరల్ నెట్‌వర్క్‌ల ఉపయోగం వ్యక్తిగతీకరించిన క్యాన్సర్ వ్యాక్సిన్‌ను రూపొందించడానికి అవసరమైన కంప్యూటింగ్ వ్యవధిని తగ్గించగలదు. ప్రస్తుతం సుదీర్ఘమైన ప్రక్రియ అయినప్పటికీ ఇది గంట కన్నా తక్కువ సమయంలోనే క్యాన్సర్ వ్యాక్సిన్‌లను అభివృద్ధి చేయగలదని పేర్కొన్నారు. న్యూరల్ నెట్‌వర్క్ కంప్యూటింగ్ ఈ విధానాలకు అరగంట నుంచి గంట సమయం పడుతుంది” అని రష్యా వ్యాక్సిన్ చీఫ్ తెలిపారు.

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!